అంచనాలను మించని “వరుడు”
Thu, Apr 1 2010
తెలుగు సంస్కృతిని, తెలుగింటి పెళ్ళిళ్ల సాంప్రదాయాలని తనదైన శైలిలో తెరక్కించాలని తాపత్రయపడ్డ దర్శకుడు గుణశేఖర్ కొంత మేరకే సక్సెస్అయ్యాడని చెప్పుకోవాలి. భారీ అంచనాల నడుమ ఈ రోజు అందరి ముందుకి వచ్చిన “వరుడు”, తమ అంచనాలని మించి పోతాడని ఆశించిన వాళ్ళకి కొంత నిరాశ తప్పదు. పోనీ, అంచనాలకు తగ్గట్టుగా అయినా ఉన్నాడా అంటే సూటిగా సమాధానం చెప్పడం కాస్త కష్టమే. వేటూరి సాహిత్యం,మణిశర్మ సంగీతం, “వరుడు”గా అల్లు అర్జున్ అభినయం సినిమాకు ప్రధాన బలం. వీటన్నిటికీ మించి, సినిమా ద్వితీయార్ధంలో వచ్చే విలన్ ఆర్య… తన విభిన్నమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆర్‌డి. రాజశేఖర్ ఛాయాగ్రహణం ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదనిపించింది.
ఒక అందమైన నేపధ్యాన్ని ఎంచుకున్న దర్శకుడి కష్టం సినిమాలోని ప్రతి ఫ్రేములో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాకి ప్రధాన కథా వస్తువు పెళ్లి కాబట్టి, ఆ పెళ్లి వాతావరణాన్ని, బంధువుల హడావిడిని, ముఖ్యంగా పెళ్లి మండపం…అన్నిటినీ అందంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. గుణశేఖర్ ఊహాశక్తినీ, కళా దర్శకుడు అశోక్ ప్రతిభను ఈ సందర్భంగా మెచ్చుకోకుండా ఉండలేం. పాత తరం నాటి పదహారు రోజుల పెళ్లి సంగతులన్నిటినీ ఒక్క పాటలో చూపించిన విధానం బాగుంది. సాధ్యమైనంత వరకు అన్ని అంశాలను సృజనాత్మకంగా స్పృశించాడు గుణశేఖర్. “వరుడు” ముందు నుండే అందరికి పరిచయమైన వాడే అయినా , వధువు భానుశ్రీ మెహ్రా మాత్రం ఇంటర్వెల్ కి కొంచెం ముందుగా మాత్రమే పరిచయం అవుతుంది. సినిమా మొదలైనప్పటినుండి “వధువు”ను దాచిపెట్టి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న గుణశేఖర్, ఆ హీరోయిన్ ని తెరమీద ప్రెజెంట్ చేసిన తీరు మరీ అంత గొప్పగా ఏమీలేదు. కాకుంటే ఇక్కడ ఒక్క విషయం మాత్రం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఏ దర్శకుడూ తన హీరోయిన్ ని గుణశేఖర్ “వరుడు”లో చేసినట్టుగా పరిచయం చెయలెదు.అది మాత్రం వాస్తవం.
కథ:అల్లరి చిల్లరగా తిరిగే సందీప్( అల్లు అర్జున్)అనే ఒక పేజ్౩ కుర్రాడు, అమ్మాయిల విషయంలో మాత్రం హద్దు దాటడు. ఎటువంటి ప్రేమ వ్యవహారాలు అతనికి ఉండవు. అమెరికాలో జాబ్ సంపాదించుకున్న అతను వెళ్ళిపోయేలోగా పెళ్లి చేసి పంపించాలని సందీప్ తల్లిదండ్రులు( సుహాసిని, ఆశిష్ విద్యార్ధి) అనుకుంటారు. పెళ్లి విషయం సందీప్ దెగ్గర ప్రస్తావించగానే తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని తెలుసుకోగానే షాక్ అవుతారు(?). తన కోసం ఒక అందమైన అమ్మాయిని వెతికే పనిని సందీప్ అతని తల్లి దండ్రులకి అప్పగిస్తాడు. ఫోటో కూడా చూడకుండా పెళ్ళికి సిద్ధపడ్డ సందీప్, వధువు దీప్తి( భానుశ్రీ మెహ్రా) కూడా తనను ఫోటో చూడకుండా పెళ్ళికి సిద్ధపడ్డట్లు తెలుసుకుని థ్రిల్ కి గురవుతాడు. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుండగా , అనుకోని అతిధిలా వచ్చిన విలన్ దివాకర్( ఆర్య) హీరోయిన్ ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇది ఇంటర్వల్ బ్యాంగ్. పెళ్లి పీటల మీద తొలిసారి వధువుని చూసి మనసు పారేసుకున్న హీరో, హీరోయిన్ ని వెతికే క్రమంలో దివాకర్ ఎందుకు దీప్తి వెనకాల పడుతున్నాడు, దీప్తిని అతను ఎక్కడ దాచి పెట్టాడు…. తన వధువుని ఎలా ఆ రాక్షసుడి చెర నుండి విడిపించుకొని వచ్చాడు అన్నదే మిగతా కథ.
కామెంట్:
ఒక చక్కటి కుటుంబ వాతావరణం నుండి ఒక్కసారిగా భారీ ఛేజులు , ఫైట్లు అంటూ దర్శకుడు పూర్తిగా దారి తప్పాడు. ఆ సడన్ జర్క్ ఆఫ్ ఎమోషన్స్ తట్టుకోవడం సగటు ప్రేక్షకుడికి మింగుడు పడని విషయమే. కథకు ఎక్కువశాతం అవసరం లేని చోట గ్రాఫిక్స్‌ని మితిమీరి వాడుకోవడం కూడా జీర్ణించుకునేట్టుగా లేదు. కథకు సరిపడా హాస్యం లేకపోవడం పెద్ద లోపం.
మాటలు:తోట ప్రసాద్ డైలాగ్స్ కూడా అంతగా పేలలేదు. ఒక చోట శీలం అనేది మనసుకు సంబంధించినది, శరీరానికి కాదు అని కొన్ని వందల సినిమాల్లో, వేల మంది నటీ నటుల నోట్లో నలిగిన డైలాగ్స్ వాడటం చిరాకు పుట్టిస్తుంది. ఇంకాస్త మంచిగా మాటలు రాసుంటే బాగుండేది.
కామెంట్:పెళ్లి పట్ల ఒక నిబద్ధత, సాంప్రదాయాల పట్ల ఎనలేని గౌరవం, తల్లిదండ్రుల మాటకు విలువిచ్చే నైజం, జీవితంలో ప్రతిమనిషికి ఆయంత ముఖ్యమైన పెళ్లి విషయంలో అమ్మాయిని కనీసం ఫోటో కూడా చూడకుండా పెళ్ళిచేసుకోవడానికి సిద్ధపడే అంత విశాల హృదయం, ధృక్‌పధం ఉన్న మనిషిగా హీరోని అంత బాగా ఎలివేట్ చేసి, ఆ హీరో పాత్ర చేత కన్నతల్లిదండ్రులని పేరుపెట్టి పిలిపించడం కనీసం ఊహకు కూడా అందనిది.

“వరుడు” గా అల్లు అర్జున్ నటన అందరినీ అలరిస్తుంది. ఇటు డాన్స్, అటు ఫైట్స్ లలో ఎంతో ఈజ్ కనబరిచాడు. చాలా కష్టపడి చేశాడు. హీరోయిన్ భాను మెహ్రా ఫర్వాలేదనిపించింది. ముఖ్యంగా దివాకర్ గా విలన్ ఆర్య ఆదరగొట్టాడు. ఒక సైకో పాత్రలో ఎంతో వైవిధ్యంగా , ఎంతో ఈజీగా చేశాడు. ఖచ్చితంగా హీరోతో సమానంగా విలన్ కి కూడా మార్కులు పడతాయి.
కామెంట్: సుహాసిని, ఆశిష్ విద్యార్ధి, నరేశ్, నాజర్, రావు రమేశ్ , శాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్ తదితరులు తమ పరిధి మేరకు బాగానే నటించినా, పెళ్లి హడావిడి సందర్భంగా వచ్చే బంధువులు అంతా కొత్తవారు కావడం, సహజంగా ఉంటుందని వాళ్ళని పెట్టుకున్నా ఎవరూ సరిగా ఎక్స్‌ప్రెషన్స్ పలికించలేకపోవడం, ఆ ఎపిసోడ్ మొత్తం కుత్రిమంగా అనిపించడం, ఒక సాధారణ “తాత” పాత్రలో సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు పెద్దగా ప్రభావం చూపకపోవడం, ఈ సినిమాలో ఏకైక ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోవడం ప్రధాన లోపాలు.
ఇక మణిశర్మ సంగీతం , వేటూరి సాహిత్యం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే… ప్రధానంగా ఐదురోజుల పెళ్లి అనే పాట గురించి చెప్పుకోవాలి.రకరకాల వేరియేషన్స్ తో మణిశర్మ మ్యాజిక్ చేయగా…కవి కలం కదమ్ తొక్కింది ఈ పాటలో. సినిమా నేపధ్య సంగీతం కూడా చాలా చోట్ల బాగుంది. కొత్తగా ఉంది.
క్లుప్తంగా చెప్పాలంటే, “వరుడు” పెళ్లి ఏర్పాట్లు( సినిమా నిర్మాణం) ఘనంగానే జరిగినప్పటికీ, పెళ్లి తంతు (సినిమా) మాత్రం సాదా సీదాగానే సాగింది. ఇక పెళ్ళికి వచ్చే వారు( ఆడియెన్స్) వధూవరులని ఏమని ఆశీర్వాదిస్తారో తెలియాలంటే( హిట్టా / ఫట్టా అని) కొద్ది రోజులు ఆగాల్సిందే.
Pages:



