పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు


అతనొక హ్యూమన్ సునామీ. అతడికి ఉన్న క్రేజ్ అనంతం. కుర్రకారుకి ఆ పేరు వింటేనే మత్తెక్కుతుంది. పూనకం వచ్చి ఊగిపోతారు. అతడి స్టైల్ కి అభిమానులు పడి చచ్చి పోతారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గురించే అని వేరే చెప్పక్కర్లేదు. ఆంధ్ర ప్రేక్షకులను అంతలా ప్రభావితం చేసే హీరో పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు(సెప్టెంబరు 2). అభిమానులకి పండుగ రోజు.

రెండు మూడేళ్లకు ఒక సినిమా చేసినా పవన్ పైన ఉన్న అభిమానం ఏ మాత్రం చెక్కు చెదరదు. కారణం, అట సమయం తీసుకున్నా తన కొత్త చిత్రంలో అభిమానుల ఆశలను మించి పోయే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు పవన్. పెద్దల పట్ల అమితమయిన గౌరవం, అన్న చిరంజీవి అంటే భక్తి శ్రద్ధలు , పని పట్ల అంకితభావం-నిబద్ధత, ముక్కుసూటి తనం, విప్లవ భావాలు, ఆధ్యాత్మిక చింతన, నిష్కల్మషమయిన ప్రేమ, కాసింత మొండి పట్టుదల… ఇవన్నీకలగలిపి పవన్ కళ్యాణ్ ని ఎప్పటికప్పుడు ఎవరి అంచనాలకు అందని విధంగా ముందుకు నడిపిస్తున్నాయి. అతనికి ఒక ప్రత్యేకమయిన స్థానాన్ని కట్టబెట్టాయి. పవన్ గురించి తెలియని చాలామంది అతనికి పొగరెక్కువ, ఎవరితోనూ కలవడు, మాట్లాడడు..తనలోకం తనదే, ఏదీ పట్టించుకోడు…అహం ఎక్కువ…ఇలా ఎన్నో అనుకుంటారు. కానీ అతడి మనస్సును మధించిన వారికి పవన్ లో ఒక తాత్వికుడు కనిపిస్తాడు, ఒక మేధావి కనిపిస్తాడు, కఠోరమైన తపస్సు చేస్తున్న ఒక ముని కనబడతాడు, ఒక పసి పిల్లాడు కనిపిస్తాడు.

తన మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే  చేస్తాడు పవన్. విజయాలు, ఓటములు ఏవీ అతడికి పట్టవు. కేవలం తన పని తాను చేసుకుపోయే నిగర్వి పవన్ కళ్యాణ్ అని చాలా మందికి తెలియదు. కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్మే పవన్, చాలా మృదుస్వభావి. జీవితంలో ఎన్నో ఒడి దుడుకులని చిరునవ్వుతో భరిస్తూ ముందుకు సాగే నైజం పవన్ సొంతం. కిందపడిపోతానన్న భయం అతనికి ఎప్పుడూ లేదు…ఎందుకంటే మళ్లీ పైకి లేవడం ఎలాగో పవన్ కి తెలుసు కాబట్టి ఎప్పుడూ తొణకడు, బెణకడు. దేనికీ, ఎవ్వరికీ భయపడడు.

“సుస్వాగతం”, “తొలిప్రేమ”, “తమ్ముడు”,”బద్రి”,  “ఖుషి” లాంటి చిత్రాలతో యువతలో ఎనలేని క్రేజ్ సంపాదించిన పవన్, “జానీ”, “బంగారం”, “అన్నవరం” లాంటి చిత్రాలతో కాస్త వెనుక పడ్డాడు. ఆ తరువాత మళ్లీ పుంజుకుని, “జల్సా” చిత్రంతో నేలకు కొట్టిన బంతిలా రివ్వున పైకి లేచాడు. తన స్టామినా ఏమిటో మరొక సారి చూపాడు. త్వరలో అభిమానులకు “పులి” వేషంలో కనువిందు చేయనున్నాడు. ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ఏసు క్రీస్తు జీవితం కథాంశంగా రూపొందుతోన్న ఒక చిత్రంలో పవన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. మంచి కథ దొరికితే ఇమేజ్ కి సంబంధం లేకుండా ఎలాంటి పాత్ర చేయడానికైనా నేను సిద్ధమే అని చెప్పే పవన్ కళ్యాణ్ కి మాస్టార్స్  మరొక సారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఇలాంటి పుట్టిన రోజులను పవన్ ఎన్నో జరుపుకోవాలని , మరెన్నో సూపర్ హిట్ సినిమాలను అభిమానులకు అందించాలని మనసారా ఆకాంక్షిస్తోంది.


Pages:

Leave a Reply