వైభవం గా ‘బిజినెస్ మేన్’ ఆడియో ఆవిష్కరణ


‘బిజినెస్‌మేన్’తో మహేష్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతుంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. మహేష్‌బాబు, కాజల్ అగర్వాల్ జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ‘బిజినెస్‌మేన్’ ఆడియో వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. మూడు భాషల్లో ఆడియోను విడుదల చేశారు. తమిళ వెర్షన్ ఆడియోను కృష్ణ, విజయనిర్మల ఆవిష్కరించారు. మలయాళం ఆడియోను డి.రామానాయుడు, రాజమౌళి విడుదల చేయగా, తెలుగు వెర్షన్ పాటలను మహేష్, శ్రీను వైట్ల ఆవిష్కరించారు.

అనంతరం మహేష్ మాట్లాడుతూ -‘‘జగన్ ఎప్పుడు సినిమా మొదలుపెట్టారో, ఎప్పుడు పూర్తి చేశారో నాకే తెలియలేదు. జగన్ పెన్ పవరేంటో రేపు తెరమీద చూస్తారు. థమన్ అద్భుతంగా సంగీతం అందించాడు. జనవరి 11న మనందరికీ పెద్ద పండుగ మొదలు కాబోతుంది’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ -‘‘రెండేళ్లు సినిమా తీయడం కాదు. పూరి జగన్నాథ్‌లా ఆరు నెలల్లో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని నా శ్రీమతి అంటూ ఉంటుంది. అందుకే ఆయన దగ్గర రెండు సినిమాలకైనా అసిస్టెంట్‌గా పనిచేయాలని ఉంది. మహేష్, నేను కలిసి సినిమా చేయాలని కమిటైపోయాం.

కౌబాయ్, జేమ్స్‌బాండ్ తరహా కావాలో లేక అల్లూరి సీతారామరాజులాంటి సినిమా చేయాలో అభిమానులే నిర్ణయించాలి’’ అని తెలిపారు. మహేష్, నమ్రతలను పూరి జగన్నాథ్ సభాముఖంగా సరదాగా ఇంటర్వ్యూ చేయడం అభిమానుల్ని అలరించింది. ఈ కార్యక్రమంలో ఇంకా కాజల్ అగర్వాల్, చార్మి, ‘దిల్’రాజు, భోగవల్లి ప్రసాద్, నిషా అగర్వాల్, అచ్చిరెడ్డి, సురేష్‌రెడ్డి, జెమినీ కిరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Pages:

Leave a Reply