సెలక్టివ్‌గా వెళుతున్నాను:శ్రీయ


‘‘ఇప్పుడే కాదు… మరో పదేళ్ల తర్వాత కూడా నా అందం చెక్కుచెదరదు. అప్పుడు కూడా ఇదే స్థాయిలో మెరిసిపోతా’’ అంటున్నారు అందాలభామ శ్రీయ. ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం 29 ఏళ్లు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కి ముప్ఫైలోకి అడుగుపెడతారు. అంటే… మరో పదేళ్ల తర్వాత శ్రీయకు అక్షరాలా 40 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో కూడా ఇదే గ్లామర్‌తో మెరిసిపోతా అన్నది ఆమె అభిప్రాయం. ఈ ముద్దుగుమ్మ స్టేట్‌మెంట్ విన్నవాళ్లందరూ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటున్నారు. దానికి శ్రీయ సమాధానమిస్తూ -‘‘అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకుంటున్నారు.

నేను ఎంతో కాన్ఫిడెన్స్‌తో చెబుతున్న మాట. అందం అనేది పూర్తిగా మనసుకు సంబంధించింది. మనసు ప్రశాంతంగా ఉంటే… అరవైల్లో కూడా ఇరవైగా కనిపించొచ్చు. అదే మనసు పరిపరి విషయాలపై పరిభ్రమిస్తూ స్థిమితం లేకుండా ఉంటే… ఇరవైల్లో కూడా అరవై ఏళ్ల వ్యక్తుల్లా తయారవుతాం. మనిషికి కావాల్సింది ముఖ్యంగా మానసిక ప్రశాంతత.

అదే నాకు వరం’’ అని చెప్పారు. ‘‘ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. సినిమాలు తగ్గిన మాట నిజమే. ఖాళీగా ఉంటున్నాను అన్నమాట మాత్రం నిజం కాదు. ఈ పదేళ్లలో నేను ఖాళీగా ఉన్న దాఖలాలు లేవు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పుకుంటే ఇప్పటికి నా చేతిలో ఓ అరడజను సినిమాలుండేవి. అలా కాకుండా సెలక్టివ్‌గా వెళుతున్నాను. అందుకే మీకు కెరీర్ డల్ అయినట్టు కనిపిస్తుంది’’ అన్నారు శ్రీయ


Pages:

Leave a Reply